అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్‌లో జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. ఈ సారి జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జేపీ నడ్డాతో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు సమావేశమయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతారనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతల సమావేశం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ ఎలా ఎదుర్కొవాలనే దానిపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శాఖ చీఫ్ సంజయ్ బండి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఉన్నారు.
బీజేపీ
దిల్లీ మద్యం కేసులో కవితను టార్కెట్ చేయాలని అధిష్ఠానం సూచన!
బీఆర్ఎస్‍తో పాటు కేసీఆర్ లక్ష్యంగా విమర్శస్త్రాలను ఎక్కుపెట్టాలని బీజేపీ ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని దిల్లీ పెద్దలు రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారిన దిల్లీ మద్యం కేసును అస్త్రంగా చేసుకొని కేసీఆర్‌పై మాటల దాడికి దిగాలని కేంద్రం నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కుమార్తె కవిత ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు కవితను టార్గెట్ చేసారు. తర్వాత టార్గెట్ కవితేనని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
దీనికి తోడు బీజేపీ ప్రజా గోసా, బీజేపీ భరోసా, ప్రజా సంగ్రామ యాత్రపై మరింత దృష్టి సారించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.