కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అన్ని రాజకీయ పక్షాలను ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఉత్తర కన్నడ జిల్లాలోని బనవాసి మార్గంలో వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. 'డీల్ ఈజ్ యువర్స్, కమీషన్ ఈజ్ అవర్' అనే శీర్షికతో 'PayCM' QR కోడ్‌ను కార్మిక మంత్రి శివరామ్ పట్టుకున్నట్లు ఆ పోస్టర్లు ఉన్నాయి. సీఎం బొమ్మై బనవాసి పర్యటన నేపథ్యంలో ఆ మార్గంలో ఈ పోస్టర్లు అతికించారు. PayCM క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే '40శాతం సర్కార్' అనే వెబ్‌సైట్‌కి తీసుకెళ్తుంది. బీజేపీ ప్రభుత్వం పబ్లిక్‌వర్క్‌లపై 40శాతం కమీషన్‌ను వసూలు చేస్తోందని ఆరోపిస్తూ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు.
బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నస్తోంది: సీఎం
గతవారం కర్ణాటకలోని తుమకూరులో కూడా ఇలాంటి పోస్టర్లే వెలిశాయి. బీజేపీ ఎమ్మెల్యే జీబీ జ్యోతిగణేష్‌కు వ్యతిరేకంగా ఈ పోస్టర్లను అతికించారు. క్యూఆర్ కోడ్ ఉన్న పేఎంఎల్ఏ పోస్టర్లు కనిపించాయి. ఎమ్మెల్యే జ్యోతిగణేష్ బొమ్మ ఉన్న ఆ పోస్టర్లలో 'మీకు ఏదైనా పని కావాలంటే నాకు డబ్బు ఇవ్వండి' అని రాసి ఉండటం గమనార్హం. బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో PayCM, PayMLA పోస్టర్‌లను అతికించారు. గతంలో బెంగళూరులో సీఎం ముఖంతో PayCM పోస్టర్లు అతికించినందుకు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ ఈ ప్రయత్నం చేస్తోందని సీఎం బొమ్మై ఆరోపించారు.