మహిళా పోలీసును నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే; బూతులు తిట్టారని ఇన్‌స్పెక్టర్ ఆరోపణ
ఒడిశా అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు జయనారాయణ్ మిశ్రా తన విధులకు ఆటంకం కలిగించారని, తనను దుర్భాషలాడారని సంబల్‌పూర్ జిల్లాలోని ధనుపాలి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనితా ప్రధాన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించన వీడియో వైరల్‌గా మారింది. అనితా ప్రధాన్ పట్ల జయనారాయణ్ మిశ్రా వ్యవహరించిన తీరుపై ఒడిశాలో రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై జయనారాయణ్ మిశ్రా స్పందించారు. తాను మహిళా పోలీసుపై ఎలాంటి దాడి చేయలేదని చెప్పారు. అనితా ప్రధాన్‌ను నెట్టేసినట్లు వీడియోలో కనపడుతున్నా, జయనారాయణ్ బుకాయిసున్నాడంటూ ఇతర రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ వీడియో చూసి తాను షాక్ గురైనట్లు ఆర్జేడీ ఎంపీ అనుభవ్ మొహంతి ట్వీట్ చేశారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా చేయడం అవాంఛనీయం: అనితా ప్రధాన్
జనవరి 29న రాష్ట్ర మంత్రి నబా కిసోర్ దాస్‌ను ఏఎస్‌ఐ హత్య చేయడంతో పాటు ఇతర నేరాలకు నిరసనగా ఒడిశా అంతటా బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళనలో భాగంగా బీజేపీ కార్యకర్తల బృందం సంబల్పూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వైపు కవాతు చేస్తుండగా మహిళా పోలీసు అధికారి అనితా ప్రధాన్ వారిని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో జయనారాయణ్ మిశ్రా-అనితా ప్రధాన్ మధ్య వాగ్వాదం జరిగినట్లు వీడియోలో కనపడుతుంది. ఈ క్రమంలో జయనారాయణ్ మిశ్రా బూతులు తిట్టి, నెట్టేశారని అనితా ప్రధాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గౌరవనీయమైన పదవిలో ఉండి ఎమ్మెల్యే ఇలా చేయడంపై తాను అవాక్కయినట్లు అనిత చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి చేసిన ఈ చర్య పూర్తిగా అవాంఛనీయమైనదన్నారు.