Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్
మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది.ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ఎదుట బారులుదీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్, అరుణాచల్‌ప్రదేశ్‌లోని లుమ్లా, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్దిఘి, జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. నాగాలాండ్‌లోని 60అసెంబ్లీ స్థానాల్లో 59సీట్లకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కజెటో కినిమి అకులుటో నియోజకవర్గంలో పోటీ లేకుండా విజయం సాధించారు. వివిధ పార్టీల నుంచి మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 13,17,632 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
సాయంత్రం 4గంటలకు పోలింగ్ ముగింపు
మేఘాలయలో కూడా మొత్తం 60అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. సోహియాంగ్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి మరణించడంతో పోలింగ్ వాయిదా పడింది. మేఘాలయలో 2,160,000 మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నరు. మొత్తం 3,419పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మేఘాలయలోని 60అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 ఖాసీ, జైంతియా హిల్స్ ప్రాంతంలో ఉండగా, 24 గారో హిల్స్ ప్రాంతంలో ఉన్నాయి. మేఘాలయ, నాగాలాండ్‌లో ఉదయం 7గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4గంటలకు ముగుస్తుంది. 60ఏళ్ల చరిత్రి ఉన్న నాగాలాండ్ అసెంబ్లీకి ఇంతవరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాలేదు. ఈ ఎన్నికల్లో అయినా అబలలకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందా? అని ఆ రాష్ట్ర మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.