Page Loader
Iran Airspace: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ గగనతలం మూసివేత.. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం
విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం

Iran Airspace: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ గగనతలం మూసివేత.. విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. ఇటీవలి పరిణామాల్లో, ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని ముందస్తు దాడులకు దిగింది. ముఖ్యంగా టెహ్రాన్‌ పరిధిలోని అణు కేంద్రాలు,సైనిక స్థావరాలే ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి. శుక్రవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు మోగటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా వెల్లడించింది. ఈ దాడులకు ప్రతీకారంగా, ఇరాన్ సైతం చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో ప్రతీకార దాడులు ప్రారంభించింది. అయితే, ఈ డ్రోన్ దాడులను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొడుతోందని వర్గాలు తెలిపాయి.

వివరాలు 

 అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం 

ఇజ్రాయెల్ వాయుసేన దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్, జాతీయ భద్రతా పరంగా తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, అలాగే ఢిల్లీ, ముంబై నుంచి లండన్, న్యూయార్క్‌కు వెళ్లే అనేక విమానాలు ప్రభావితమయ్యాయి. కొన్ని విమానాలు దారిమళ్లించబడ్డాయి, మరికొన్నింటిని మళ్లీ ప్రారంభ స్థానాలకు తిరిగిపంపారు. ఈ ప్రభావిత రూట్లలో దాదాపు 16 ఎయిర్‌ ఇండియా విమానాలను దారి మళ్లించామని ఎయిర్‌లైన్స్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విమానయాన రంగానికి ఈ పరిణామాలు తీవ్రమైన అంతరాయం కలిగించాయి.