Atishi: దిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి
దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా శనివారం అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఆమెతో పాటు మంత్రులుగా గోపాల్ రాయ్, కైలాస్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావలకు మంత్రి పదవి దక్కింది. కొత్త మంత్రులతో కూడా వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు.
దిల్లీ సీఎంగా అతిషి ఏకగ్రీవ ఎంపిక
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. తర్వాత దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఇక ఆప్ పార్టీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదించారు. ఆప్ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించడంతో, ఆతిశీ దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేజ్రీవాల్ తనకు ప్రజలు సాక్షిగా నిజాయతీపరుడని సర్టిఫికెట్ ఇచ్చే వరకు సీఎం పదవిని చేపట్టనని స్పష్టం చేశారు.
2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతిషి
దిల్లీ మాజీ ముఖ్యమంత్రులు షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్ తర్వాత ఆతిశీ దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడో మహిళగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా, ఆమె అతి పిన్న వయస్కురాలైన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. దిల్లీలో పుట్టి పెరిగిన ఆతిశీ మార్లేనా సింగ్ ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, దిల్లీ ప్రభుత్వ పాఠశాలల సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించిన ఆతిశీ, దిల్లీ కేబినెట్‌లో ఏకైక మహిళా మంత్రిగానూ కొనసాగారు.