Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్
వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోకముందే తమపార్టీని నాశనం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందని ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహాడ్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారిచింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తూ లోక్ సభ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీని నిర్మూలించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ తనకు మధ్యంతర బెయిల్ కావాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈడీ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డు చేయలేదు
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు హాజరై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు వాదనలు విన్పించారు. దేశంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్ ను అరెస్టు చేయడాన్నిఆయన తప్పుపట్టారు. అండర్ సెక్షన్ 50 కింద ఈడీ కేజ్రీవాల్ స్టేట్మెంట్ ను రికార్డు చేయలేదని,తప్పని సరి పరిస్థితుల్లో అరెస్టు చేస్తున్నామని మాత్రమే పేర్కొన్నారని,నిగూఢమైన ఉద్దేశ్యంతో మాత్రమే కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్పించారు. అయితే, లిక్కర్ పాలసీ స్కాంలో కీలకంగా ఉన్నఆప్ కీలకనేత తాను చేసిన మనీలాండరింగ్ నేరం పట్ల పశ్చాత్తాపపడుతున్నారని సుదీర్ఘ లేఖలో ఈడీ పేర్కొంది. నిందితుడు కస్టడీని వ్యతిరేకించడంలేదని,కాబట్టి అతడి పిటిషన్ విచారణర్హమైనది కాదని ఈడీ అందులో తెలిపింది.