Himachal Pradesh: ఆగస్టు 24వరకు హిమాచల్‌లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక
హిమాచల్ ప్రదేశ్‌ను ఇప్పట్లో వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అల్లాడిపోతోంది.కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరికొన్ని రోజులు కూడా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. ఆగస్టు 21న అంటే సోమవారం నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. చంబా, మండి జిల్లాల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఆగస్టు 26 వరకు హిమాచల్‌లో వాతావరణం మేఘావృతం
ఆగస్టు 26 వరకు రాష్ట్రంలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నీటిమట్టం పెరగడంతో మనాలిలోని కోల్‌డామ్‌లో ఆదివారం 10మంది చిక్కుకుపోయారు. ఈ 10 మందిలో ఐదుగురు స్థానికులు, మరో ఐదుగురు అటవీ శాఖ ఉద్యోగులు. ఎన్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు కోల్‌డామ్‌లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా రక్షించింది. ఈ విషయాన్ని మండి డీసీ అరిందం చౌదరి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 12 జిల్లాలు వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా ప్రభావితమయ్యాయి.