Chennai-Metro Trains: నగరంలోకి డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు..వచ్చే ఏడాది ఆగస్టులో పట్టాలపైకి
చెన్నై నగర శిగకు మరో మణిహారం వచ్చి చేరనుంది. మూడు పెట్టెలతో 138 డ్రైవర్ రహిత మెట్రోరైళ్లు రానున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా ఇవి పట్టాలపైకి ఎక్కనున్నాయి. మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా ఈ మెట్రో రైలు ప్రాజెక్టు ను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు మార్గాల్లో 116.1 కిలో మీటర్ల మేర పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆ మూడు మార్గాల్లో ఒకటి మాధవరం పాల డిపో నుంచి సిప్కాట్ వరకు 45.8 కిలోమీటర్ల వరకు రెండోది లైట్ హౌస్ నుంచి పూందమల్లి వరకు 26 కిలోమీటర్లు, మూడవది మాధవరం నుంచి షోళింగనగర్ వరకూ 47 కిలోమీటర్లు మేర పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.
63,246 కోట్ల రూపాయల వ్యయంతో...
ఈ డ్రైవర్ రహిత మెట్రో రైలు ప్రాజెక్టు కోసం 63,246 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నారు. ఈ మార్గాల్లో 119 మెట్రో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పనులన్నీ 2026 చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ రైళ్లు ఆటోమేటిక్ ఏఐ సాంకేతికతతో , జీపీఎస్, సిగ్నల్ రీడింగ్, టైమింగ్ సీక్వెన్స్ తదితర టెక్నాలజీతో నడుస్తాయని వివరించింది. ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ముందు ఏడాదిపాటు ట్రయిల్ రన్ నిర్వహిస్తామని వెల్లడించింది. తొలిదశలో పూందమల్లి-పోరూర్ మధ్య 2 6 డ్రైవర్ రహిత రైళ్ల నిర్వహణ బాధ్యతల్ని సీఎంఆర్ ఎల్ కు అప్పగిస్తామని పేర్కొంది.