తెలంగాణలో కొత్తగా మరో 3 డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా.. మొత్తం 14కు చేరిన స్వయంప్రతిపత్తి కాలేజీలు
తెలంగాణలో కొత్తగా మరో 3 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు అటానమస్ హోదా దక్కించుకున్నాయి. ఆయా కాలేజీలు న్యాక్ - ఏ గ్రేడ్‌ను సాధించుకోవడంతో యూజీసీ స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అటానమస్ హోదా దక్కింది. గతేడాది రాష్ట్రంలోని 11 డిగ్రీ కళాశాలలు స్వతంత్ర హోదాను సాధించాయి. ఇప్పుడు కొత్తగా మరో 3 కాలేజీలు సైతం అటానమస్ హోదా దక్కించుకున్నాయి. దీంతో స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాల సంఖ్య మొత్తం 14కు చేరుకుంది. అటానమస్ హోదా విషయంలో యూజీసీ ( యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ) గతంలో పలు మార్పులు చేర్పులను చేసింది.
15 ఏళ్లు అటానమస్ హోదా ఉంటే, శాశ్వత హోదా ఇస్తాం : యూజీసీ
హోదాకు వర్సిటీలతో నిమిత్తం లేకుండా నేరుగా యూజీసీకే దరఖాస్తు చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించింది. సదరు కాలేజీని ప్రారంభించి 10 సంవత్సరాలు గడిచి, న్యాక్ - ఏ గ్రేడ్ పొంది ఉంటే, వాటికి అటానమస్ హోదాను కల్పిస్తోంది. తొలుత పదేళ్ల వరకే అటానమస్ హోదా ఇస్తున్నారు. ఒక కళాశాలకు 15 ఏళ్లు అటానమస్ హోదా ఉంటే, శాశ్వత హోదాను ఇస్తున్నట్లు యూజీసీ పేర్కొంది. న్యాక్-ఏ గ్రేడ్ లేని కళాశాలల్లో కనీసం 3 బ్రాంచీలకు ఎన్‌బీఏ అక్రిడిటేషన్ ఉన్నా ఈ హోదా ఇవ్వనున్నారు. అటానమస్ హోదా కలిగిన కోఠి మహిళా డిగ్రీ కళాశాలను 2 ఏళ్ల క్రితం వర్సిటీగా ప్రమోట్ చేసి డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా, పీజీ సీట్లను సీపీగెట్ ద్వారా భర్తీ చేస్తున్నారు.