Rahul Gandhi: అయోధ్య రామమందిరం విరాళాల వివాదం.. ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే సంయుక్త లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంయుక్తంగా లేఖ రాశారు. భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి విరాళాల వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. లేఖలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు వచ్చిన వేల కోట్ల రూపాయల విరాళాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయని పేర్కొన్నారు. ఈ ఘటన కారణంగా లక్షలాది మంది భక్తులు తమను మోసగించారని భావిస్తున్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
వివరాలు
వీహెచ్‌పీతో సంబంధాలు ఉన్నాయి
అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి పార్లమెంట్‌లో ప్రకటించిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.
ట్రస్ట్ సభ్యుల నియామకాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగాయని తెలిపారు. ట్రస్ట్‌లోని పలువురు సభ్యులకు ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి కూడా ప్రధానమంత్రికి సన్నిహితుడేనని లేఖలో ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మౌనం సరికాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై పూర్తిస్థాయి స్వతంత్ర విచారణకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వివరాలు
విచారణకు ఆదేశాలివ్వాలి
నగదు, బంగారం, వెండి సహా భక్తులు సమర్పించిన అన్ని విరాళాల లెక్కలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎవరైనా తప్పు చేసి ఉంటే వారి హోదా, పలుకుబడితో సంబంధం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా విరాళాల లెక్కల్లో అక్రమాలు జరిగి సుమారు రూ.7 కోట్ల విలువైన నగదు, నగలు దారి మళ్లినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.
దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)ను ఏర్పాటు చేసింది. ట్రస్ట్ ఖాతాల పరిశీలనతో పాటు నగదు లెక్కింపు కేంద్రాల పనితీరును కూడా ఈ బృందం విచారిస్తోంది. కేసు పురోగతిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది.