Loading...
Polavaram: పోలవరం పనులకు స్పీడ్‌.. 2027 లక్ష్యంగా 43 అంశాలతో మాస్టర్ ప్లాన్!
పోలవరం పనులకు స్పీడ్‌.. 2027 లక్ష్యంగా 43 అంశాలతో మాస్టర్ ప్లాన్!

Polavaram: పోలవరం పనులకు స్పీడ్‌.. 2027 లక్ష్యంగా 43 అంశాలతో మాస్టర్ ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన మొత్తం 43 కీలక పనులను గుర్తించి సమగ్ర సూక్ష్మ ప్రణాళిక రూపొందించారు. ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి కేవలం ఎనిమిది నెలల గడువే మిగిలి ఉంది. ప్రధాన డ్యాంలోని గ్యాప్-1, గ్యాప్-2 నిర్మాణాలతో పాటు వాటికి సంబంధించిన వివిధ దశల పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఆకృతుల ఆమోదం, అవసరమైన నిర్మాణ సామగ్రి సమీకరణ, ఎడమ-కుడి కాలువల అనుసంధానం, స్పిల్‌వే సుందరీకరణ, స్పిల్‌వేకు సమాంతరంగా ఎడమ, కుడి గట్టులను కలిపే ఐకానిక్ బ్రిడ్జి, కేబుల్ బ్రిడ్జి నిర్మాణం వంటి కీలక అంశాలను ప్రణాళికలో చేర్చారు.

వివరాాలు

ప్రధాన డ్యాం పనులపై ప్రత్యేక దృష్టి

అలాగే రెండు ప్రధాన కాలువల్లో మిగిలిన పనులు, అనుబంధ నిర్మాణాలు, ప్రధాన డ్యాంలో పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలకు ఈ కార్యాచరణలో స్థానం కల్పించారు.

ప్రస్తుతం గ్యాప్-1, గ్యాప్-2 డ్యాంల నిర్మాణాన్ని పూర్తి చేయడానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

గ్యాప్-2 డ్యాంలో కుడి అబట్‌మెంట్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఇప్పటికే సమర్పించగా, జులై నెలాఖరులోగా వాటికి అనుమతులు లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

గ్యాప్-2 డ్యాంకు ప్రస్తుతం +23.32 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే అనుమతులు లభించాయి.

+53.32 మీటర్ల వరకు నిర్మాణానికి సంబంధించిన ఆకృతులను కేంద్ర జలసంఘానికి పంపగా, వాటికి కూడా ఈ నెలలోనే ఆమోదం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు

పనుల పురోగతిపై అధికారుల సంతృప్తి

80 మీటర్ల నుంచి 1,450 మీటర్ల చైనేజీ వరకు సాగుతున్న పనుల పురోగతిపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం +17మీటర్ల నుంచి +23.32మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం కొనసాగుతోంది. జులై చివరినాటికి మొత్తం గ్యాప్-2 డ్యాంను +23.32 మీటర్ల స్థాయికి తీసుకువచ్చి, అనంతరం +53.32 మీటర్ల వరకు నిర్మాణ పనులు ప్రారంభించాలనేది లక్ష్యం.

ఈ స్థాయి పూర్తైతే గోదావరి సీపేజీ నీటి ప్రభావం తగ్గి, పైభాగ నిర్మాణాన్ని మరింత సులభంగా కొనసాగించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

గ్యాప్-1 డ్యాం ఇప్పటికే +33 మీటర్ల ఎత్తు వరకు పూర్తికాగా, అక్కడి నుంచి +53.32 మీటర్ల వరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్యాప్‌ల నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

ADVERTISEMENT

వివరాలు

మట్టి, రాయి సమీకరణ కొనసాగింపు

ప్రధాన డ్యాం నిర్మాణానికి ఇంకా పెద్ద మొత్తంలో మట్టి, రాయి అవసరమవుతోంది.

మొత్తం 8.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవసరం ఉండగా, ఇప్పటివరకు 2.66 లక్షల క్యూబిక్ మీటర్లు వినియోగించారు. మరో 2.54 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ప్రస్తుతం డ్యాం వద్ద సిద్ధంగా ఉంది.

జులై నెలాఖరులోగా అదనంగా 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని సమీకరించనున్నారు. 2027 జనవరి నాటికి మరో 2.05 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు.

రాయి విషయానికి వస్తే, మొత్తం 49.20 లక్షల క్యూబిక్ మీటర్లు అవసరం కాగా, ఇప్పటివరకు 8.70 లక్షల క్యూబిక్ మీటర్లు వినియోగించారు.

ADVERTISEMENT

వివరాలు

గేట్ల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ

మరో 13.10 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి డ్యాం ప్రాంతంలో సిద్ధంగా ఉంది. మిగిలిన రాయిని 2026 డిసెంబరు నాటికి దశలవారీగా సమీకరించాలని నిర్ణయించారు.

ప్రాజెక్టు ప్రారంభానికి ముందే గేట్ల ఆపరేషన్ షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రణాళికను ఐఐటీ రూర్కీ నిపుణులు రూపొందిస్తున్నారు. 2026 డిసెంబర్ నాటికి దీనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇక గేట్లు, గ్యాంట్రీలకు సంబంధించిన పెండింగ్ పనులను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయనున్నారు.

గేట్ల నిర్వహణ కోసం స్కాడా (SCADA) వ్యవస్థతో పాటు ఆధునిక కంట్రోల్ రూం ఏర్పాటు పనులు కూడా కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT