Page Loader
Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట

Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అమలు విషయంలో ఢిల్లీ ఆప్‌ ప్రభుత్వానికి ఊరట లభించింది. పథకానికి సంబంధించిన ఎంవోయూపై సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. "బలవంతంగా సంతకం చేయించడం ఏంటని?" అని ప్రభుత్వ వాదనను స్వీకరించి, సుప్రీం కోర్టు నిలుపుదల ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీకల్లా దేశ రాజధానిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఎంవోయూపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయాలని ఢిల్లీ హైకోర్టు గత నెలలో ఆదేశించింది.

వివరాలు 

ఆదేశాలను సవాల్ చేస్తూ ఆప్‌ సర్కార్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆప్‌ సర్కార్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ అనంతరం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌,జస్టిస్‌ ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం, ఎయిమ్స్‌, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఢిల్లీలోనూ అమలు చేయాలని చూస్తోంది. అయితే, దేశ రాజధానిలో దీనికి అవసరం లేదని, ఇక్కడి ప్రజలు రాష్ట్ర సంక్షేమ పథకాల ద్వారా అనేక ప్రయోజనాలు పొందుతున్నారని ఢిల్లీ ఆప్‌ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదం రాజకీయ దుమారం రేపింది.

వివరాలు 

దేశవ్యాప్తంగా 6 కోట్ల సీనియర్‌ సిటిజన్లకు లాభం

బీజేపీ ఎంపీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అయితే,ఈ ఆదేశాలకు సుప్రీం కోర్టులో బ్రేకులు పడ్డాయి.సుప్రీం కోర్టులో ఆప్‌ ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పథకంలోని లక్ష్యం: ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) పథకం,70 ఏళ్ల పైబడిన ప్రతి పేద, ధనిక వ్యక్తికి ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందించడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 6 కోట్ల సీనియర్‌ సిటిజన్లకు లాభం చేకూరుతుందని అంచనా. ఆయుష్మాన్‌ కార్డు ఉన్న 70 ఏళ్ల పైబడి వృద్ధులు ప్రతి కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు ఆరోగ్య సదుపాయం పొందగలుగుతారు.

వివరాలు 

వృద్ధులకు రూ.5 లక్షల అదనపు కవరేజీ

ఈ పథకంలో సామాజిక, ఆర్థిక వర్గాలకు సంబంధం లేకుండా అన్ని వృద్ధులకు వైద్య బీమా అందించబడుతుంది. ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో ఉన్న వృద్ధులకు రూ.5 లక్షల అదనపు కవరేజీ కూడా అందజేయబడుతుంది. ఒకే కుటుంబంలో 70 ఏళ్లపైబడి ఇద్దరు వృద్ధులు ఉంటే, వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌, ఆయుష్మాన్‌ సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ పథకాల్లో ఉన్న వయోవృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవై పథకాన్ని గానీ ఎంచుకోవచ్చు.

వివరాలు 

ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్‌ మాత్రమే సరిపోతుంది 

ప్రైవేట్ వైద్య ఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా పథకాలు ఉపయోగించే వారు కూడా రూ.5 లక్షల ప్రయోజనం పొందగలుగుతారు. ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్‌ లేదా ఆయుష్మాన్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాల్లో ఆధార్‌ మాత్రమే సరిపోతుందని, ఇటీవల కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొంది.