
Vice president nominee: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బి. సుదర్శన్ రెడ్డి.. ఆయన ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఉప రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలకు సంబంధించి విపక్ష కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. విపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయని తెలిపారు. అధికార పక్షం ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించి, ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలని విజ్ఞప్తి చేసిన సందర్భంలోనే విపక్షాల ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
Details
సుప్రీంకోర్టులోనూ పనిచేసిన అనుభవం
ఖర్గే మాట్లాడుతూ దేశంలో ప్రముఖ న్యాయనిపుణుల్లో ఒకరైన బి. సుదర్శన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్, గువాహటి హైకోర్టులలో, తరువాత సుప్రీంకోర్టులోనూ విశిష్ట సేవలు అందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే అభిప్రాయానికి ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిపక్షాలన్నీ ఒకే పేరును అంగీకరించడం ప్రజాస్వామ్యానికి పెద్ద విజయమని పేర్కొన్నారు.
Details
సుదర్శన్ రెడ్డి ప్రస్థానం
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం గ్రామానికి చెందినవారు. ఆయన 1946 జూలైలో జన్మించారు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, అదే ఏడాది డిసెంబర్ 27న బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో గువాహటి హైకోర్టు ముఖ్య న్యాయమూర్తిగా పనిచేశారు. 2007 నుండి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. తరువాత 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా నియమితులై బాధ్యతలు స్వీకరించారు. అయితే వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు.