Chandrababu Naidu: చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సోమవారం తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు.. మంగళవారం నిర్ణయాన్ని వెలువరించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు 52రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు. గతంలో టీడీపీ అధినేత దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం చంద్రబాబు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన మెడికల్ ఎమర్జీని దృష్టిలో పెట్టుకొని.. చికిత్స నిమిత్తం, నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.
పోటాపోటీగా హైకోర్టులో సోమవారం వాదలు
మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం చంద్రబాబు తరపున న్యాయవాదులు, సీఐడీ తరఫున న్యాయవాదులు పోటాపోటీగా వాదనలు వినిపించారు. చంద్రాబాబు యాభై రోజులుగా జైలులో ఉన్నారని, ఆయనపై పెద్దగా ఎలాంటి ఆరోపణలు లేవని తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తక్షణమే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని వారు కోర్టుకు నివేదించారు. ఇవి వయస్సు సంబంధిత సమస్యలని, వెంటనే క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరం లేదని ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు వాదించారు. బెయిల్ కోసం చంద్రబాబు అనారోగ్య కారణాలను వాడుకుంటున్నారని, దానిని కాలక్షేపం చేయకూడదన్నారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ టి మల్లికార్జునరావు మెడికల్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.