AP High Court: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి ప్రమాణ స్వీకారం
ఈ వార్తాకథనం ఏంటి
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కోర్టు హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తిగా బాలాజి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్‌జీ) పార్థసారథి సభ ముందు చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్ బాలాజి, జస్టిస్ రవినాథ్ తిల్హరితో కలిసి కేసుల విచారణలో పాల్గొన్నారు. ఆయన నియామకంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది.
వివరాలు
కార్యక్రమానికి హాజరైనవారు
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ బాలాజి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇన్‌ఛార్జి అధ్యక్షుడు రఘువీర్, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. అనంతరం పలువురు న్యాయవాదులు, బంధువులు, శ్రేయోభిలాషులు జస్టిస్ బాలాజిని కలిసి అభినందనలు తెలిపారు.
వివరాలు
కీలక కేసుల్లో వాదనలు వినిపించిన అనుభవం:
జస్టిస్ బాలాజి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. 1972 మే 29న వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం శేషన్నగారిపల్లి గ్రామంలో లక్ష్మీనరసమ్మ, సుబ్బయ్యనాయుడు దంపతులకు జన్మించారు. రాజంపేటలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన, తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని పడాల రామారెడ్డి న్యాయ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసించారు. వారి కుటుంబంలో న్యాయ వృత్తిలో ప్రవేశించిన తొలి వ్యక్తి ఆయనే. 1997లో అప్రెంటిస్‌గా శిక్షణ పొందారు. 1998 ఏప్రిల్ 9న బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వద్ద ప్రాక్టీస్‌ను ప్రారంభించారు.
వివరాలు
కీలక కేసుల్లో వాదనలు వినిపించిన అనుభవం:
జస్టిస్ బాలాజికి భార్య కల్యాణి, కుమారుడు సుచంద్రహాస్, కుమార్తె లక్ష్మీశ్వేత ఉన్నారు. రాజ్యాంగ అంశాలతో పాటు సివిల్, క్రిమినల్, సర్వీస్, కమర్షియల్ కేసులపై ఆయనకు విశేష అనుభవం ఉంది. అనేక కీలక కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించారు. 2004 నుంచి 2006 వరకు అప్పటి అడ్వకేట్ జనరల్ కార్యాలయానికి అనుబంధంగా ఏజీపీగా పనిచేశారు. 2018-19 మధ్య కాలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా సేవలందించారు. అంతేకాకుండా, వివిధ బ్యాంకులు మరియు పలు ప్రతిష్ఠాత్మక సంస్థలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసిన విశాల అనుభవం కూడా జస్టిస్ బాలాజికి ఉంది.