Ban On Mobiles: స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. విద్యార్థులు పాఠశాలల్లోకి ఫోన్లు తేవడాన్ని బ్యాన్ చేసిన ప్రభుత్వం, ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్స్ తీసుకురావొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. టీచర్లు తరగతి గదుల్లోకి వెళ్లేముందు తమ మొబైల్స్‌ను ప్రిన్సిపల్ కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల దిల్లీ ప్రభుత్వం కూడా ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
యూనెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టు ఆధారంగా బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్నితీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర సంఘాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధనలు అమలయ్యేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.