చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ వివాదంలో చిక్కుకున్నారు. తోటి విద్యార్థులను కొట్టడంతో పాటు అసభ్యకర పదజాలంతో తిట్టిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెండు వీడియోల్లోనూ స్నేహితులతో కలిసి ఆయన రెచ్చిపోవడాన్ని గమనించవచ్చు. మంత్రికి చెప్పినా తనను ఎవరూ ఏమీ చేయలేరని భగీరథ్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. భగీరథ్ స్నేహితులు కూడా విద్యార్థులపై చేయిచేసుకున్నట్లు వీడియోలో కనపడుతుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదవుతున్న భగీరథ్.. గతంలోనూ ఇలా దురుసుగా ప్రవర్తిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తోంది. దిల్లీలో చదువుకుంటున్నప్పుడు ఇలా దురుసుగా ప్రవర్తించడం వల్లే కాలేజీ నుంచి పంపించినట్లు సమాచారం.
బండి సంజయ్ కుమారుడు కొడుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియో
రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా?: బండి సంజయ్
భగీరథ్ వీడియోలపై కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలపై బండి సంజయ్ కూడా స్పందించారు. పిల్లల విషయాన్ని రాజకీయం చేయొద్దని చెప్పారు. పిల్లలు కొట్టుకుంటారు, మళ్లీ కలుస్తారని పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఆ విడియోల్లోని ఓ బాధిత విద్యార్థి కూడా స్పందించారు. తన పేరు శ్రీరామ్ అని, భగీరథ్ స్నేహితుని సోదరితో తప్పుగా ప్రవర్తించానని చెప్పాడు. ఈ విషయం తెలిసిన భగీరథ్ తనను చూడడానికి రావడంతో తమ మధ్య వాగ్వాదం జరిగినట్లు శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ ఘటన గతంలో జరిగిందని, దీన్ని ఎప్పుడో మర్చిపోయామని శ్రీరామ్ చెప్పాడు. ఈ వీడియోలను ఇప్పుడు ఎందుకు బయటికి తీస్తున్నారని ప్రశ్నించారు.