టోల్ ప్లాజాల్లో అరనిమిషం ఆగకుండా వెళ్లిపోవచ్చు.. కొత్త సిస్టమ్ కోసం కొనసాగుతున్న ట్రయల్స్
దేశంలోని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద త్వరలో కొత్త టోల్ వ్యవస్థను అమలుకు కేంద్రం నడుం బిగించింది. అధునాతన సాంకేతికతతో కూడిన కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఆగకుండానే గేట్ దాటేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే కొత్త టోల్ వ్యవస్థను వినియోగంలోకి తీసుకురానున్నట్లు కేంద్ర రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇకపై టోల్ ప్లాజాల వద్ద అర నిమిషం కూడా ఆగాల్సిన పని లేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానం స్థానంలో అవాంతరాలు లేని టోల్ వ్యవస్థ లేదా ఓపెన్ టోల్ విధానం అమలు కోసం ట్రయల్స్ కొనసాగుతున్నట్లు చెప్పారు.
నిరీక్షించే సమయాన్ని 30 సెకన్ల కంటే తక్కువగా కుదించడమే మా లక్ష్యం : వీకే సింగ్
పరీక్షలు విజయవంతం కాగానే అమల్లోకి తీసుకొస్తామని కేంద్రమంత్రి వీకే సింగ్ తెలిపారు. ఈ నూతన సిస్టమ్ ద్వారా సామర్థ్యం మరింత మెరుగుపడి ప్రయాణ సమయం కలిసి వస్తుందన్నారు. ప్రస్తుతం ఫాస్టాగ్ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ టైమ్ 47 సెకన్లకు తగ్గించగలిగామన్నారు. ఇప్పుడు దీన్ని 30 సెకన్ల కంటే తక్కువగా కుదించడమే కేంద్రం లక్ష్యమన్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేసే కొత్త టోల్ వ్యవస్థను దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేలో తాజాగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఒక వాహనం జాతీయ రహదారిపైకి ప్రవేశించగానే టోల్ ప్లాజా వద్ద వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేస్తుందన్నారు. దీంతో ప్రయాణించిన కిలోమీటర్లకే ఛార్జీలు చెల్లింపులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.