Page Loader
గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తున్న కేంద్రం.. దిల్లీ-చెన్నైల మధ్య 300 కిమీ దూరం తగ్గింపు
దిల్లీ - చెన్నైల మధ్య 300 కిమీ దూరం తగ్గింపు

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తున్న కేంద్రం.. దిల్లీ-చెన్నైల మధ్య 300 కిమీ దూరం తగ్గింపు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 28, 2023
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ నుంచి దక్షిణాదిలోని కీలక మెట్రో సిటీ చెన్నైల మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుంది. ఈ మేరకు దిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌ వేకి అనుసంధానంగా సూరత్‌ నుంచి చెన్నై వరకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మిస్తోంది. గడిచిన 9 ఏళ్లలో తమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. సూరత్‌-నాసిక్‌- అహ్మద్‌నగర్‌- సోలాపుర్‌- కర్నూలు నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి వరకు పలు రహదారులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. సూరత్‌ - సోలాపూర్‌ రహదారిని రూ.25 వేల కోట్లతో 719 కిమీ రహదారి నిర్మాణం 11 శాతం మేర పూర్తయిందన్నారు.

DETAILS

7 వరల్డ్ రికార్డులను నెలకొల్పాం : గడ్కారీ

హైదరాబాద్‌ - రాయ్‌పుర్‌ రహదారిని నిర్మించేందుకు పనులను ఇంకా ప్రారంభించలేదని, అయితే రాయ్ పూర్‌ - విశాఖపట్నం మాత్రం రూ.17 వేల కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. సుమారు 465 కిమీ నిర్మాణంలో 34 శాతం మేర పూర్తయిందన్నారు. అలాగే ఇండోర్‌ - హైదరాబాద్‌ మధ్య 525 కిమీ రహదారి నిర్మాణ పనులు 68 శాతం పూర్తయ్యాయని గడ్కారీ వివరించారు. నాగ్‌పూర్‌-విజయవాడ మార్గంలో 21 శాతం పూర్తి చేశామని తెలిపారు. ఇక రూ.4,754 కోట్లతో చిత్తూరు నుంచి థాచర్‌ వరకు నిర్మిస్తున్న 116 కిమీ రహదారి పనులు 3 శాతం అయ్యాయన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో 7 వరల్డ్ రికార్డులను నమోదు చేసిందని గడ్కారి చెప్పారు.

DETAILS

అమెరికా తర్వాత అతిపెద్ద రహదారులు కలిగిన దేశంగా భారత్‌

అగ్రరాజ్యం అమెరికా తర్వాత అతిపెద్ద రహదారులు కలిగిన దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించిందని గడ్కారీ వెల్లడించారు. తాము కేంద్ర పగ్గాలు చేపట్టే నాటికే రహదారుల నెట్‌వర్క్‌ దాదాపుగా 91 వేల 287 కిమీ ఉందన్నారు. 2013-14లో రూ.4,770 కోట్లుగా ఉన్న టోల్‌ ఛార్జీలు ప్రస్తుతానికి రూ.41 వేల 342 కోట్లకు చేరుకున్నాయన్నారు. 2030 నాటికి ఇది రూ.1.30 లక్షల కోట్లకు పెరుగుతాయన్నారు. దేశీయ సంస్థలు బజాజ్‌, టీవీఎస్‌, హీరో ఫ్లెక్స్‌ ఇంజిన్‌ స్కూటర్‌, ఆటో రిక్షాలు తయారు చేస్తున్నాయని, టయోటా, సుజుకి సైతం ఫ్లెక్స్‌ ఇంజిన్‌ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అయితే ఇందులో 100 పర్సంట్ ఇథనాల్‌ వాడవచ్చని, ఫలితంగా పెట్రోల్‌ ధర లీటర్ కు రూ.15కి సమానమవుతుందని చెప్పుకొచ్చారు.