Delhi: బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు ఢిల్లీలోని 10 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లు సీజ్
భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించిన పలు ఆస్తులపై దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సీలింగ్ చర్యలు చేపట్టింది. వివిధ జోన్లలో ఆస్తుల దుర్వినియోగం, బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించినందుకు కోచింగ్ సెంటర్లు, ప్రాపర్టీ యజమానులకు MCD నోటీసులు కూడా జారీ చేసింది. అన్ని మండలాల్లోని బేస్‌మెంట్లలో నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లు, ఇతర ఆస్తులను గుర్తించేందుకు కార్పొరేషన్ సర్వే నిర్వహిస్తోంది. షాహదారా (సౌత్ జోన్),కరోల్ బాగ్,నజఫ్‌గఢ్ జోన్లలో బిల్డింగ్ బైలాస్ ఉల్లంఘించిన 10 ఆస్తులపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సీలింగ్ చర్య తీసుకుందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. కరోల్ బాగ్ జోన్‌లో అక్రమంగా లైబ్రరీ నడుపుతున్న నాలుగు బేస్మెంట్స్ ను సీల్ చేశారు.
నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లు,ఇతర ఆస్తులను గుర్తించేందుకు కార్పొరేషన్ సర్వే
అదే సమయంలో, షహదారా సౌత్ జోన్‌లోని కోచింగ్ సెంటర్స్ లైబ్రరీకి చెందిన 4 బేస్‌మెంట్లను సీల్ చేశారు. కాగా, నజఫ్‌గఢ్ జోన్‌లో 2 బేస్‌మెంట్ల కోచింగ్ సెంటర్లు/లైబ్రరీలను సీలు చేశారు. దీంతోపాటు అన్ని మండలాల్లోని బేస్‌మెంట్లలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లు, ఇతర ఆస్తులను గుర్తించేందుకు కార్పొరేషన్ సర్వే నిర్వహిస్తోంది. ఈ చర్య భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా, భవిష్యత్తులో జరిగే సంఘటనలను నివారించడానికి విస్తృత ప్రయత్నంలో భాగం. బిల్డింగ్ నిబంధనలను ఉల్లంఘించే ఆస్తులపై ఈ చర్య కొనసాగుతుందని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. బిల్డింగ్ బైలాస్‌ను ఖచ్చితంగా అమలు చేయడానికి, విద్యార్థులు, పౌరుల భద్రతను నిర్ధారించడానికి కార్పొరేషన్ కట్టుబడి ఉంది.
ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి
ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని రూస్ ఐఎఎస్ స్టడీ సర్కిల్ లైబ్రరీలో చదువుతున్నప్పుడు, బేస్‌మెంట్‌లో అకస్మాత్తుగా నీరు నిండిపోవడంతో ముగ్గురు విద్యార్థులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.