Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత
జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను సోమవారం పూర్తి చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్ణయించింది. దీంతో హర్యానా ప్రభుత్వం, నూహ్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులకు సోమవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంతే కాకుండా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 28 అర్ధరాత్రి 12గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వాస్తవానికి శోభాయాత్రకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. అయినా శోభా యాత్రకు నిర్వహించేందుకు వీహెచ్‌పీ పిలుపునివ్వడం గమనార్హం. సెప్టెంబరు 3-7 వరకు నుహ్‌లో G20 షెర్పా గ్రూప్ సమావేశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం యాత్రకు అనుమతిని నిరాకరించింది.
నూహ్ జిల్లాలో సెక్షన్ 144 విధింపు
శోభాయాత్రపై నుహ్ ఎస్‌డీఎం అశ్వనీ కుమార్ స్పందించారు. శోభాయాత్రకు అనుమతి లేదన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాలో సెక్షన్ 144 విధిస్తున్నట్లు ప్రకటించారు. గుంపులు, గుంపులుగా తిరగొద్దని ఎస్‌డీఎం అశ్వనీ కుమార్ జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు. హర్యానా ప్రభుత్వం జిల్లాలో 1,900 మంది హర్యానా పోలీసు సిబ్బంది, 24 కంపెనీల పారామిలటరీ బలగాలను అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల వద్ద మోహరించింది. జులై 31న చెలరేగిన మత ఘర్షణల కారణంగా ఆరుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారి ఉన్నారు. నూహ్ జులై 31న మత ఘర్షణనలు చెలరేగిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటివరకు 393 మందిని అరెస్టు చేయగా, 118 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు.