'Butcher of Hindus': బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ నోబెల్ అవార్డ్‌ని పరిశీలించాలి.. నోబెల్ కమిటీకి బీజేపీ ఎంపీ లేఖ
బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ, బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఒక లేఖ రాశారు. ఆయన లేఖలో, బంగ్లాదేశ్‌లో హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్రమైన అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని కోరారు.
దుర్గాపూజ పండగలకు అంతరాయం ఏర్పడింది
"నేను ఈ లేఖను భారతదేశం హృదయంతో రాస్తున్నాను. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలు అన్యాయానికి గురవుతున్నాయి. డా. యూనస్ మైక్రోఫైనాన్స్ ద్వారా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందినప్పటికీ, అతని పాలనలో మానవాళికి వ్యతిరేకమైన క్రూరమైన నేరాలు జరుగుతున్నాయి. ఈ దశలో హిందూ సమాజం చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. సామూహిక హత్యలు, లక్ష్యంగా చేసుకుని దాడులు, అత్యాచారాలు, మతపరమైన అణిచివేతలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయి. దుర్గాపూజ పండగలకు అంతరాయం ఏర్పడింది". అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
అఘాయిత్యాలు ప్రేరేపించే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం తప్పు
మహతో తన లేఖలో మరింత ఆందోళన వ్యక్తం చేస్తూ, బంగ్లాదేశ్‌లో సామూహిక హత్యల వెనక డాక్టర్ మహ్మద్ యూనస్ సూత్రధారిగా ఉన్నారని ఆరోపించారు. "నోబెల్ శాంతి బహుమతి శాంతి, న్యాయానికి వ్యతిరేకమైన వ్యక్తులకు ఇచ్చినప్పుడు, ఆ బహుమతి తన నైతికతను కోల్పోతుంది. ఒకప్పుడు సమాజ సంక్షేమ దార్శనికుడిగా పేరున్న మహ్మద్ యూనస్, ఇప్పుడు "హిందువుల కసాయి"గా మారిపోయారని, మైనారిటీలను రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆయన ఇలా అఘాయిత్యాలు ప్రేరేపించే వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం తప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.