Page Loader
Kolkata: ఆందోళన విరమించిన వైద్యులు.. శనివారం నుంచి విధుల్లోకి ..
ఆందోళన విరమించిన వైద్యులు.. శనివారం నుంచి విధుల్లోకి ..

Kolkata: ఆందోళన విరమించిన వైద్యులు.. శనివారం నుంచి విధుల్లోకి ..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగాల్‌లో అభయ ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం అందించాలని డిమాండ్ చేస్తూ 41 రోజులుగా జూనియర్‌ డాక్టర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాజాగా, ఈ జూనియర్‌ డాక్టర్లు తమ ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. రేపటి నుంచి (శనివారం) అత్యవసర వైద్య సేవల్లో పాల్గొంటామని తెలియజేశారు. ప్రభుత్వంతో జరిగిన రెండు సమావేశాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,జూనియర్‌ డాక్టర్ల మధ్య రెండు రోజుల క్రితం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు మమతా అంగీకరించారు. ప్రభుత్వ ఆమోదం పొందిన డిమాండ్ల మేరకు శనివారం నుండి పాక్షికంగా విధులకు హాజరుకానున్నట్టు జూనియర్‌ వైద్యులు చెప్పారు.

వివరాలు 

 సీబీఐ కార్యాలయానికి ర్యాలీ 

వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే విధులు నిర్వహిస్తారని, అవుట్‌ పేషెంట్‌ విభాగాల్లో విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. తమ ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తేస్తామని, కానీ, దానికి ముందు మధ్యాహ్నం మూడు గంటలకు నగరంలో ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కేసును త్వరగా విచారించేందుకు సీబీఐ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. బెంగాల్‌ ప్రభుత్వానికి తమ డిమాండ్లన్నిటిని నెరవేర్చేందుకు ఒక వారం సమయం ఇస్తామని, ఈ కాలంలో అమలుకాకపోతే తిరిగి విధులను బహిష్కస్తామని హెచ్చరించారు. అంతేకాక, జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో మనోజ్‌ కుమార్‌ వర్మను నియమించారు.

వివరాలు 

మాజీ ప్రిన్సిపల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు 

మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కౌస్తవ్‌ నాయక్‌, హెల్త్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ దేవాశిష్‌ హల్దేర్‌ను కూడా వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు. మొత్తానికి, ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ను బంగాల్‌ వైద్య మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది. 1914 బెంగాల్‌ వైద్య చట్టం కింద కూడా ఆయన మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు సమాచారం.