West Bengal: బెంగాల్‌లో జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ప్రజా రవాణాపై ఆధారపడే లక్షలాది మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు ఈ నిర్ణయం ఉపయుక్తంగా మారుతుందని అధికారులు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు, జీవన వ్యయాల కారణంగా కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉపశమనం కలిగించడంతో పాటు, వారి ప్రయాణ వ్యయాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
వివరాలు
ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయో పరిమితి మరో ఐదేళ్ల పాటు పెంచే ప్రతిపాదనకు ఆమోదం
అలాగే, జూన్ 1 నుంచే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర పథకం అమల్లోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయో పరిమితిని మరో ఐదేళ్ల పాటు పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల మేరకు మరిన్ని సంక్షేమ పథకాలను కూడా త్వరలో అమల్లోకి తీసుకువస్తామని ప్రభుత్వం పేర్కొంది.