LOADING...
Bengaluru: 'ప్రేమ' పేరుతో దారుణం.. ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి సజీవదహనం చేసిన యువతి
'ప్రేమ' పేరుతో దారుణం.. ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి సజీవదహనం చేసిన యువతి

Bengaluru: 'ప్రేమ' పేరుతో దారుణం.. ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి సజీవదహనం చేసిన యువతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేస్తానని చెప్పి ప్రియుడిని ఇంటికి పిలిపించిన ఓ యువతి, అతడిని కట్టేసి దారుణానికి ఒడిగట్టింది. ఈ సంఘటన బెంగళూరు శివారులోని అంజనానగర్‌లో, బైదరహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పథకం ప్రకారమే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తుమకూరుకు చెందిన కిరణ్‌ నగరంలోని ఓ మొబైల్‌ సేవా కేంద్రంలో పనిచేస్తున్నాడు. అదే కేంద్రంలో పనిచేసే ప్రేమ అనే యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే ఇటీవలి కాలంలో కిరణ్‌ తనను పట్టించుకోవడం లేదని, పెళ్లి విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నాడని భావించి ఆ యువతి అనుమానించింది.

వివరాలు 

ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తం చేస్తా..

ఈ నేపథ్యంలో, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరణ్‌ను తన ఇంటికి రమ్మని పిలిచింది. కొంతసేపు మాట్లాడుకున్న అనంతరం అతడిని కుర్చీలో కూర్చోబెట్టి కళ్లకు గంతలు కట్టింది. తర్వాత చేతులు, కాళ్లను బిగించి కట్టేసింది. ఇలా ఎందుకు చేస్తున్నావని కిరణ్‌ ప్రశ్నించగా, ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తం చేస్తానని చెప్పి అతడిని నమ్మించింది. కొద్దిసేపటి తర్వాత అతడిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. దీంతో కుర్చీలోనే కిరణ్‌ సజీవదహనమయ్యాడు.

వివరాలు 

ముందుగానే పథకం వేసి చేసిన హత్యగా నిర్ధారించిన పోలీసులు 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో తాను స్నానగదిలో ఉన్నానని, పొగ రావడంతో బయటకు వచ్చేసరికి కిరణ్‌ కాలిపోయి కనిపించాడని ప్రేమ పోలీసులకు తెలిపింది. అయితే స్థలాన్ని పరిశీలించిన అధికారులు, ఈ ఘటన యాదృచ్ఛికం కాదని, ముందుగానే పథకం వేసి చేసిన హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామని ఉత్తర పశ్చిమ విభాగ ఉప పోలీసు కమిషనర్‌ డీఎల్‌ నగేష్‌ తెలిపారు.

Advertisement