LOADING...
Bengaluru: 'మమ్మల్ని 'భయ్యా' అని పిలవొద్దు'.. బెంగళూరు క్యాబ్‌ డ్రైవర్ ఏర్పాటు చేసిన ఆరు నిబంధనల‌ బోర్డు నెట్టింట‌ వైరల్ 
బెంగళూరు క్యాబ్‌ డ్రైవర్ ఏర్పాటు చేసిన ఆరు నిబంధనల‌ బోర్డు నెట్టింట‌ వైరల్

Bengaluru: 'మమ్మల్ని 'భయ్యా' అని పిలవొద్దు'.. బెంగళూరు క్యాబ్‌ డ్రైవర్ ఏర్పాటు చేసిన ఆరు నిబంధనల‌ బోర్డు నెట్టింట‌ వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాంకేతిక నగరం బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో పెట్టిన 'ప్రయాణికుల నిబంధనలు' బోర్డు ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రయాణికులు ఎలా ప్రవర్తించాలనే దానిపై అతడు రూపొందించిన ఆరు షరతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలతో స్పందిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి ఒక క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ బోర్డు కంటపడింది. వెంటనే దాని ఫోటో తీసి, "నిన్న ప్రయాణించిన క్యాబ్‌లో ఇదిచూశాను" అనే క్యాప్షన్‌తో రెడిట్‌లోని 'r/bangalore' గ్రూప్‌లో షేర్ చేశాడు. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయింది.

వివరాలు 

బోర్డులోని ఆరు రూల్స్

ఆ బోర్డులో పేర్కొన్న ఆరు రూల్స్ ఇలా ఉన్నాయి: 1. మీరు ఈ కారు యజమాని కాదు. 2. ఈ కారు నడుపుతున్న వ్యక్తి దీని యజమాని. 3. మర్యాదగా మాట్లాడండి, గౌరవం పొందండి. 4. కారు డోర్‌ను నెమ్మదిగా మూయండి. 5. దయచేసి మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి. మాకు ఎక్కువ డబ్బులివ్వట్లేదు కాబట్టి అది మాకు చూపించవద్దు. 6. మమ్మల్ని 'భయ్యా' అని పిలవొద్దు. అదే కాకుండా, వాహనం వేగంగా నడపమని కోరవద్దని కూడా డ్రైవర్ ప్రత్యేకంగా పేర్కొన్నాడు.

వివరాలు 

కొత్త డిబేట్

ఈ నిబంధనలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. "అతన్ని 'అన్నా' అని పిలిస్తే ఓకేనా? లేక 'గౌరవనీయ డ్రైవర్ గారూ' అని పిలవాలా?" అంటూ ఓ యూజర్ హాస్యంగా కామెంట్ పెట్టాడు. మరో వ్యక్తి, "ఐదో నిబంధనలోని మాటలే సందేహం కలిగిస్తున్నాయి. అంటే ఎక్కువ డబ్బులిస్తే యాటిట్యూడ్ భరిస్తారా" అని ప్రశ్నించాడు. అయితే చాలామంది డ్రైవర్‌కు సపోర్ట్ చేస్తున్నారు. "కొంతమంది డెలివరీ బాయ్స్‌కైనా లిఫ్ట్‌ల్లో అనుమతి ఇవ్వరు. అలాంటప్పుడు డ్రైవర్ ఇటువంటి రూల్స్ పెట్టుకోవడంలో తప్పులేదేమో" అని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి... ఈ బోర్డుతో కస్టమర్లు-సేవ రంగంలో ఉన్నవారి మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం గురించి కొత్త డిబేట్ మొదలైంది.