Best City for Women: మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూరు.. నాలుగో స్థానంలో హైదరాబాద్..
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న వర్క్‌ప్లేస్ ఇంక్లూజన్ సంస్థ అవతార్ (Avtar) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సామాజిక మౌలిక సదుపాయాలు,పరిశ్రమల్లో మహిళల భాగస్వామ్యం వంటి ప్రమాణాలను ఆధారంగా తీసుకుని దేశవ్యాప్తంగా 125 నగరాలు మహిళలకు ఎంతమేరకు మద్దతు ఇస్తున్నాయో ఈ అధ్యయనం విశ్లేషించింది. ఈ పరిశోధనలో బెంగళూర్ 53.29 కార్పొరేట్ ఇంక్లూజన్ స్కోర్ (CIS)తో మొదటి స్థానంలో నిలిచింది. 49.86 స్కోర్‌తో చెన్నై రెండో స్థానం, 46.27తో పూణే మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక హైదరాబాద్ 46.04 స్కోర్‌తో నాలుగో స్థానంలో, ముంబై 44.49 స్కోర్‌తో ఐదో స్థానంలో నిలిచాయి.
వివరాలు
ఇంక్లూజన్ స్కోర్ ఆధారంగా మొత్తం స్కోర్
మహిళలకు భద్రత, ఆరోగ్యం, విద్య, ప్రయాణ సౌలభ్యం, జీవన ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే సామాజిక ఇంక్లూజన్ స్కోర్ (SIS), అలాగే అధికారిక ఉద్యోగ అవకాశాలు, సంస్థల్లో అమలవుతున్న ఇంక్లూజన్ విధానాలు, నైపుణ్యం గల మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని కొలిచే పారిశ్రామిక ఇంక్లూజన్ స్కోర్ (IIS) ఆధారంగా మొత్తం స్కోర్‌ను నిర్ణయించారు.
వివరాలు
బెంగళూర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టిన ప్రధాన కారణాలు
బలమైన కార్పొరేట్ వాతావరణం, విస్తృత ఫార్మల్ ఉద్యోగ అవకాశాలు, కంపెనీల్లో డైవర్సిటీ & ఇంక్లూజన్ విధానాల సమర్థ అమలు, టెక్నాలజీ, స్టార్టప్ రంగాల్లో మహిళలకు లభిస్తున్న అవకాశాలు బెంగళూర్‌ను అగ్రస్థానంలో నిలబెట్టిన ప్రధాన కారణాలుగా అధ్యయనం పేర్కొంది. భద్రత, విద్య, ఆరోగ్య సేవల విషయంలో చెన్నై మెరుగైన ప్రదర్శన కనబరిచింది. పూణే, హైదరాబాద్ నగరాలు సామాజిక, పారిశ్రామిక అంశాల్లో సమతుల్యాన్ని పాటిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. టాప్-5 నగరాల్లో దక్షిణ భారత నగరాలతో పాటు పశ్చిమ భారత నగరాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.
వివరాలు
మహిళలకు టాప్-10 బెస్ట్ నగరాలు ఇవే:
1. బెంగళూర్ 2. చెన్నై 3. పూణే 4. హైదరాబాద్ 5. ముంబై 6. గురుగ్రామ్ 7. కోల్‌కతా 8. అహ్మదాబాద్ 9. తిరువనంతపురం 10. కోయంబత్తూర్