Bengaluru: తప్పు అడ్రస్‌కు ఆర్డర్.. బ్లింకిట్ డెలివరీ బాయ్ నుంచి జీవిత పాఠం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరుకు చెందిన మాన్సీ శర్మ అనుకోకుండా బ్లింకిట్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ తప్పు చిరునామాను ఎంపిక చేసింది. డెలివరీ కోసం వెళ్లిన ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేయడంతో యాప్‌ను పరిశీలించిన ఆమె తన పొరపాటును గుర్తించింది. అనంతరం అసలు చిరునామాకు ఆర్డర్‌ను తీసుకురావాలని కోరగా,ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అతడు అంగీకరించాడు. దాదాపు మూడుకిలోమీటర్లు అదనంగా ప్రయాణించి చివరకు ఆర్డర్‌ను సరైన చిరునామాలో అందించాడు. తన వల్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కు అదనపుశ్రమ పడిందని భావించిన మాన్సీ కృతజ్ఞతగా రూ.100టిప్ ఇవ్వాలని ప్రయత్నించింది. అయితే అతడు మర్యాదపూర్వకంగా ఆ డబ్బును తిరస్కరించాడు. గతనెల తన కస్టమర్ రేటింగ్ 4.2గా ఉండేదని,ప్రతి కస్టమర్‌కు కొంత అదనపు శ్రద్ధ చూపుతూ సేవ అందించడంతో ప్రస్తుతం అది 4.8కు పెరిగిందని వివరించాడు.
వివరాలు
కస్టమర్లపై ఎక్కువ శ్రద్ధతోనే తన రేటింగ్ పెరిగిందని వివరణ
''కస్టమర్ కోసం ఇంకొంచెం ఎక్కువ చేస్తే నా రేటింగ్ మెరుగుపడుతుంది.అదే నాకు నిజమైన అప్రైజల్''అని అతడు చెప్పిన మాటలు మాన్సీని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ అనుభవాన్ని ఆమె లింక్డ్‌ఇన్‌లో పంచుకుంటూ,తనకు ఎంబీఏ విద్య ఉన్నప్పటికీ పనిపట్ల నిబద్ధత,సేవాభావం అంటే ఏమిటో ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్ తనకు నేర్పాడని పేర్కొంది.
మాన్సీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు డిగ్రీలు,అర్హతల కంటే పనిపట్ల అంకితభావం, బాధ్యతాయుతమైన సేవాభావమే వ్యక్తిని ప్రత్యేకంగా నిలబెడతాయని వ్యాఖ్యానించారు.
కస్టమర్ సంతృప్తిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేసే ఉద్యోగులే సంస్థలకు నిజమైన బలం అని అభిప్రాయపడ్డారు.