Bharat Taxi: ఓలా,ఉబర్‌కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'..వచ్చే నెల దిల్లీలో ప్రారంభంకానున్న సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం త్వరలో "భారత్ ట్యాక్సీ" (Bharat Taxi) పేరుతో కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించబోతోంది. ఈ యాప్ ఆధారిత సేవను కేంద్ర సహకార మంత్రిత్వశాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలు నవంబర్ నెలలో దిల్లీలో ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో, సొంత వాహనాలు కలిగిన 650 మంది డ్రైవర్లు దేశ రాజధానిలో భారత్ ట్యాక్సీ సేవలు అందించనున్నారు. ప్రారంభ దశ విజయవంతమైతే, డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.
వివరాలు
డ్రైవర్లకు లాభదాయకం అవనున్న సహకార్ మోడల్
ఈ సహకార్ ట్యాక్సీ (Cooperative Taxi) ప్రణాళిక గురించి కేంద్ర సహకార మంత్రి అమిత్ షా ప్రకటించిన సంగతి తెలిసిందే. సహకార సంఘాల మాదిరిగా ఈ ట్యాక్సీ వ్యవస్థ కూడా నడుస్తుంది. ఇందులో సభ్యత్వం పొందిన డ్రైవర్లు నేరుగా లాభదాయకులవుతారు. టూవీలర్‌లు, ఆటోలు, ఫోర్ వీలర్లు ఇలా అన్ని రకాల వాహనాలు ఈ సేవలో భాగం కానున్నాయని. లాభాలు ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీకి పరిమితం కాకుండా, డ్రైవర్లకే చేరే విధంగా ఈ మోడల్ రూపొందించబడిందని అమిత్ షా పేర్కొన్నారు.
వివరాలు
కమిషన్‌లేని సేవ, తక్కువ ఖర్చుతో మెంబర్‌షిప్
ఇటీవలి కాలంలో ఓలా, ఉబర్ వంటి యాప్‌లపై వినియోగదారులు, డ్రైవర్లు అనేక విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలు, బుకింగ్ క్యాన్సిలేషన్లు, అలాగే డ్రైవర్ల ఆదాయంలోనుండి 25 శాతం వరకు కమిషన్ వసూలు వంటి అంశాలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా భారత్ ట్యాక్సీ రూపుదిద్దుకుంది. ఇందులో సభ్యత్వం పొందిన డ్రైవర్లు ఏ విధమైన కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేకుండా, కేవలం స్వల్ప మెంబర్‌షిప్ ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు
భారీ లక్ష్యాలతో ముందుకు ప్రభుత్వం
ప్రభుత్వం 2026 మార్చి నాటికి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో భారత్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2030 నాటికి లక్ష మంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫారమ్‌లో భాగం చేయాలన్నది ప్రణాళిక. ఈ సేవలు సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడవనున్నాయి. ఈ సంస్థను 2025 జూన్‌లో ఏర్పాటు చేశారు.