LOADING...
Bharat Taxi: ఓలా,ఉబర్‌కు ప్రత్యామ్నాయంగా రాబోతున్న భారత్ టాక్సీ
ఓలా,ఉబర్‌కు ప్రత్యామ్నాయంగా రాబోతున్న భారత్ టాక్సీ

Bharat Taxi: ఓలా,ఉబర్‌కు ప్రత్యామ్నాయంగా రాబోతున్న భారత్ టాక్సీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ, గుజరాత్ వీధుల్లో కొత్త మొబిలిటీ విప్లవానికి శ్రీకారం చుట్టుతోంది. డ్రైవర్లకు నిజమైన యాజమాన్య హక్కులు కల్పించాలనే లక్ష్యంతో 'భారత్ టాక్సీ' రూపొందించబడింది. ప్రైవేట్ క్యాబ్ సేవలైన ఓలా, ఉబర్‌లకు ప్రత్యామ్నాయంగా, దేశవ్యాప్తంగా డ్రైవర్లను ఆర్థికంగా సాధికారులుగా మార్చడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం భారత్ టాక్సీని ఢిల్లీ, గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతాల్లో సాఫ్ట్ లాంచ్ చేశారు. డ్రైవర్ల హక్కుల కోసం గళమెత్తే, ప్రపంచంలోనే తొలి జాతీయ మొబిలిటీ సహకార సంస్థగా ప్రసిద్ధి పొందిన సహకార్ టాక్సీ కోఆపరేటివ్ ఈ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే బీటా యూజర్లతో ట్రయల్ రన్ కూడా ప్రారంభమై ఉంది.

వివరాలు 

ఈ ప్లాట్‌ఫార్మ్ పైకి 51,000 పైగా డ్రైవర్లు

భారత్ టాక్సీ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రైవర్-యాజమాన్య నెట్‌వర్క్‌గా ఎదగబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఢిల్లీ, గుజరాత్‌లలో కార్లు, ఆటోలు, బైక్ సేవల ద్వారా ఇప్పటి వరకు 51,000 మందికి పైగా డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫార్మ్ పైకి తీసుకొచ్చామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి లాంచ్ కొంత సమయం పట్టినా, ఇప్పటికే ఇది భారీ డ్రైవర్-యాజమాన్య మొబిలిటీ నెట్‌వర్క్ గా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత్ టాక్సీ మొబైల్ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ట్రయల్, ఫీడ్‌బ్యాక్ కోసం అందుబాటులో ఉంది.

వివరాలు 

ప్రారంభ దశలోనే యాప్‌కు మంచి వినియోగదారుల స్పందన

iOS వెర్షన్ త్వరలో విడుదల కానుంది. యాప్‌ను "Bharat Taxi Driver" పేరుతో Sarkar Taxi Cooperative Limited విడుదల చేసినదాన్ని డౌన్‌లోడ్ చేయమని సంస్థ సూచించింది. ప్రారంభ దశలోనే యాప్‌కు మంచి వినియోగదారుల స్పందన లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యాప్ ప్రత్యేకతలలో ఒకటి.. ఇది ఢిల్లీ మెట్రోతో అనుసంధానమవడం. దీని ద్వారా ప్రయాణికులు మెట్రో, క్యాబ్ సేవలను ఒకే యాప్‌లో బుక్ చేసుకుని, మొత్తం ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మల్టీ-మోడల్ రవాణాను మరింత సులభతరం చేస్తుందని సహకార సంస్థ తెలిపింది.

Advertisement