Swiss Bank : కేంద్రం చేతిలో స్విస్ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా
కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ స్విస్ బ్యాంకు ఖాతాదారులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు స్విస్ బ్యాంకు ఖాతాదారుల ఐదో జాబితా కేంద్రం చేతికి వెళ్లింది. స్విస్ బ్యాంకులో ఖాతా తెరిచిన భారతీయులు, భారతీయ సంస్థల జాబితా కేంద్ర ప్రభుత్వానికి చేరింది. అందులో భారత ఖాతాదారులు, సంస్థలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంది. భారత్ - స్విట్జర్లాండ్ దేశాల మధ్య సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగానే ఆ దేశ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఐదో జాబితాను అందజేసింది. భారత వ్యాపారస్తులతో పాటు కార్పొరేట్‌లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. గతంలోనే నాలుగు స్విస్ అకౌంట్ జాబితాలను అందజేసిన స్విట్జర్లాండ్ తాజాగా ఐదో జాబితా రిలీజ్ చేసింది.
సమాచార మార్పిడిలో గోప్యత నిబంధనతో ఆ ఒక్కటీ చెప్పలేదు
ఐదో జాబితాలో మొత్తం 104 దేశాలకు చెందిన 36 లక్షల ఖాతాదారుల వివరాలున్నట్లు సమాచారం. ఖాతాదారుల పేరు, అడ్రెస్, ఖాతా సంఖ్య, ఆర్థిక సమాచారం, నివాసం, ట్యాక్స్ నంబర్ తదితర కీలక అంశాలున్నాయి. ఆర్థిక సంస్థల పేరు, వాటి ఖాతాలోని నిల్వలు, మూలధన ఆదాయానికి సంబంధించిన వివరాలను స్విస్ దేశం వెల్లడించింది. ఆయా ఖాతాల్లో ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగాయనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. సమాచార మార్పిడిలో గోప్యత నిబంధన ఇందుకు అడ్డంకిగా నిలిచింది. ఈ వివరాల ఆధారంగా మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ, పన్ను ఎగవేతలు, ఇతర నేరాలపై కేంద్రం విచారణ చేపట్టనుంది. తదుపరి జాబితాను 2024 సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు స్విస్ అధికారులు పేర్కొన్నారు.