Weather Update: ఏపీ, తెలంగాణకు బిగ్ అలర్ట్.. మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రాబోయే నాలుగైదు రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా రూపాంతరం చెందింది.
వివరాలు
అల్పపీడనం నుంచి వాయుగుండంగా.. ఏపీ తీరం వైపు పయనం
ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.
అనంతరం మంగళవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA)మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ తీవ్ర వాయుగుండం బుధవారం(సెప్టెంబర్ 23)ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలోని పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుని తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు ఉత్తర కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు, అలాగే మధ్య బంగాళాఖాతం మీదుగా మరో రెండు ద్రోణులు విస్తరించి ఉన్నాయి.
ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.