LOADING...
Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. కాజీపేట-బల్లార్షా మార్గంలో ఫిబ్రవరి 14 వరకు రైళ్ల రద్దు!
ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. కాజీపేట-బల్లార్షా మార్గంలో ఫిబ్రవరి 14 వరకు రైళ్ల రద్దు!

Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. కాజీపేట-బల్లార్షా మార్గంలో ఫిబ్రవరి 14 వరకు రైళ్ల రద్దు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికులకు కీలక సమాచారం అందిస్తూ రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాజీపేట-బల్లార్షా సెక్షన్‌లోని మందమర్రి-బెల్లంపల్లి మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి చేపడుతున్న నాన్‌-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల నేపథ్యంలో ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లు రద్దు అవుతాయని కాజీపేట రైల్వే అధికారులు ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లాలో ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రయాణిస్తుంటారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలను అనుసంధానించే కీలక రైల్వే జంక్షన్‌గా కాజీపేటకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

Details

చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యక్ష రైల్వే కనెక్షన్

1929లో కాజీపేట-బల్లార్షా రైల్వే లైన్ పూర్తయిన అనంతరం చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యక్ష రైల్వే కనెక్షన్ ఏర్పడింది. కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే రైల్వే లైన్‌ను 1874లో హైదరాబాద్ నిజాం ఆర్థిక సహాయంతో నిర్మించారు. అనంతరం ఈ మార్గం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వేలో భాగమైంది. ఈ జంక్షన్ నుంచి దిల్లీ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు ప్రతిరోజూ అనేక రైళ్లు నడుస్తున్నాయి. వేలాది మంది ప్రయాణికులు ఈ జంక్షన్‌ను ఆధారంగా చేసుకుని తమ గమ్యస్థానాలకు చేరుకుంటుంటారు. అలాగే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను కూడా కాజీపేట జంక్షన్ నుంచి ప్రవేశపెడుతుండగా వీటిని పెద్ద సంఖ్యలో ప్రయాణికులు వినియోగిస్తున్నారు.

Details

టూర్ ప్యాకేజీలను అందిస్తున్న రైల్వేశాఖ

దేశంలోని వివిధ తీర్థయాత్ర కేంద్రాలను సందర్శించేందుకు రైల్వే శాఖ టూర్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. నాన్‌-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా కాజీపేట-సిర్పూర్ టౌన్ (17003) ఎక్స్‌ప్రెస్, బల్లార్షా-కాజీపేట (17004) ప్యాసింజర్, బల్లార్షా-కాజీపేట (17036) ఎక్స్‌ప్రెస్, కాజీపేట-బల్లార్షా (17035) ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా భద్రాచలం రోడ్-బల్లార్షా (17033) సింగరేణి ప్యాసింజర్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్ (17034) సింగరేణి ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రయాణికులు ముందస్తుగా సమాచారం తెలుసుకొని సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

Advertisement