Andrapradesh: బిగ్ అలర్ట్.. రెండు వారాల్లో మూడు అల్పపీడనాలు
బంగాళాఖాతం ప్రస్తుతం అల్పపీడనాల కేంద్రంగా మారింది. ఈ నెల 7న ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలతో ముంచెత్తింది. ఇక ఆదివారం నుంచి మరో అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవిర్భవించనుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రెండు రోజుల్లో ఇది మరింత బలపడి, తమిళనాడు తీరానికి చేరుతుందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తమిళనాడు సహా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ తాజా అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఏపీలో పెరిగిన చలి తీవ్రత
మరోవైపు ఐరోపా వాతావరణ మోడల్ అంచనా ప్రకారం, ఈ నెల 17న అండమాన్ సముద్ర పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడొచ్చు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు మరింత చురుకుగా మారి, ఈ నెలాఖరు వరకు విస్తృత వర్షాలను తీసుకురావొచ్చని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 18 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సంఖ్య 16 డిగ్రీల కంటే దిగువకు పడిపోయింది.
అల్లూరి సీతరామరాజు జిల్లాలో చలి పంజా
గత శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కుంతలం గ్రామంలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత ఎలా ఉందో స్పష్టంచేస్తోంది. సోమ, మంగళవారాల్లో అరకు, సాలూరు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతుండటం, థాయ్‌లాండ్ పరిసర వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో అల్పపీడనాలు వరుసగా ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే వర్షాలు, చలి తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను అనేక మార్పులకు గురిచేస్తున్నాయి. తీరాన్ని తాకే అల్పపీడనాలు చలి తీవ్రతను కొంత తగ్గించే అవకాశం ఉన్నా వర్షాల వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి.