LOADING...
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు బిగ్ షాక్‌.. భారీగా విమాన టికెట్ల రద్దు
విదేశీ ప్రయాణికులకు బిగ్ షాక్‌.. భారీగా విమాన టికెట్ల రద్దు

International flights cancelled: విదేశీ ప్రయాణికులకు బిగ్ షాక్‌.. భారీగా విమాన టికెట్ల రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్‌ ఇస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్టణం, శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై విమానాశ్రయం సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి నడిచే అంతర్జాతీయ విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణానికి నాలుగు నుంచి ఐదు రోజుల ముందే విమానాల రద్దు సమాచారం అందుతుండటంతో ముందస్తుగా ప్లాన్‌ చేసుకున్న కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే బుక్‌ చేసుకున్న టికెట్లలో దాదాపు 95 శాతం వరకు క్యాన్సిలేషన్‌ మెసేజ్‌లు వస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. టికెట్‌ డబ్బులు తిరిగి చెల్లిస్తున్నప్పటికీ, నెలల ముందే వేసుకున్న ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతింటున్నాయి.

వివరాలు

ఆకాశాన్నంటుతున్న ధరలు

ఇక కొత్తగా టికెట్లు బుక్‌ చేయాలంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో రూ.70 వేల వరకు ఉన్న విమాన టికెట్లు ఇప్పుడు వన్‌వే ప్రయాణానికే రూ.2 లక్షల వరకు పెరిగినట్లు సమాచారం. మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిన ధరలను చూసి చాలామంది కుటుంబాలు తమ విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా విజయవాడ-షార్జా విమాన సర్వీసు రద్దు కావడంతో గల్ఫ్‌ దేశాల కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. షార్జా మార్గంగా అమెరికా, యూరప్‌ వెళ్లాలని భావించిన వారి ప్రణాళికలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ నుంచి కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు.

వివరాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలే కారణం

ఈ పరిస్థితులకు పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలే ప్రధాన కారణమని విమానయాన వర్గాలు చెబుతున్నాయి. ఏవియేషన్‌ ఫ్యూయల్‌ ధరలు భారీగా పెరగడంతో పాత టికెట్‌ ధరలకే సర్వీసులు నడపడం సంస్థలకు భారంగా మారిందని సమాచారం. నష్టాలను తగ్గించుకునేందుకు కొన్ని విమాన సర్వీసులను ఎయిర్‌లైన్స్‌ రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవులు, కుటుంబ కార్యక్రమాలు, విదేశాల్లో ఉన్న పిల్లలను కలుసుకోవాలని భావించినవారికి ఈ పరిణామాలు తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకున్నా కూడా ప్రయాణంపై భరోసా లేకపోవడంతో వందలాది కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. విమానం ఎక్కకముందే ప్రయాణికులకు భారీ ఝలక్‌ తగిలిన పరిస్థితి నెలకొంది.

Advertisement