LOADING...
Karnataka: కర్ణాటక హైకోర్టు తీర్పుతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి బిగ్ షాక్!
కర్ణాటక హైకోర్టు తీర్పుతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి బిగ్ షాక్!

Karnataka: కర్ణాటక హైకోర్టు తీర్పుతో సిద్ధరామయ్య ప్రభుత్వానికి బిగ్ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వుపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వ ప్రాంగణాల్లో ప్రైవేట్ సంస్థలు కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ పునస్చైతన్య సేవా సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై మధ్యంతర స్టే విధించింది. అంతేకాకుండా ఈ ఉత్తర్వు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించేలా ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రైవేట్ సంస్థలు తమ చట్టబద్ధమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సరికాదని తెలిపారు.

Details

తదుపరి విచారణ నవంబర్ 17కి వాయిదా

జస్టిస్ నాగప్రసన్న ఆధ్వర్యంలోని సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఈ వాదనలు విన్న తర్వాత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది. రాజకీయంగా ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (RSS) కార్యకలాపాలను అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఈ ఉత్తర్వుపై కర్ణాటక మంత్రి హెచ్‌.కె. పాటిల్‌ స్పందిస్తూ, "ప్రభుత్వ నిర్ణయం ఎటువంటి సంస్థను లక్ష్యంగా చేసుకుని తీసుకోలేదు. ప్రభుత్వ లేదా సంస్థాగత ఆస్తులను సరైన అనుమతితో, సరైన ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలన్నదే ఉద్దేశ్యం. ఎవరు చట్టాలను ఉల్లంఘించినా, ప్రస్తుత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు.