TMC: టీఎంసీ రెబల్ నేతలకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. మమతా వర్గానికి ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంతర్గత విభేదాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది. బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా నియమితులైన టీఎంసీ తిరుగుబాటు వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీ నియామకాన్ని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం రద్దు చేసింది. అలాగే పార్టీ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే అక్రుజమాన్‌ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా కొట్టివేసింది.
వివరాలు
పది రోజుల్లోగా ప్రతిపక్ష నేత ఎంపికపై కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం
ప్రతిపక్ష నేత నియామకానికి సంబంధించి స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైన విధానంలో లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ వ్యవహారంలో మమతా బెనర్జీ వర్గం సమర్పించిన వాదనలను మరోసారి పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్‌ను ఆదేశించింది.
అంతేకాకుండా పది రోజుల్లోగా ప్రతిపక్ష నేత ఎంపికపై కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.
దీంతో ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో మమతా వర్గానికి అనుకూలంగా పరిణామం చోటుచేసుకున్నట్లయింది.
వివరాలు
వివాదం ఇదీ..
ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసింది.
మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 80 సీట్లకే పరిమితమైంది. మమతా బెనర్జీ సైతం ఎన్నికల్లో ఓడిపోయారు.
ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.
అసెంబ్లీలో టీఎంసీ పక్ష నేతగా శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్‌ను ఎంపిక చేయాలని మమతా బెనర్జీ నిర్ణయించారు.
అయితే తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన రితబ్రత బెనర్జీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.
ఈ పరిణామంతో రితబ్రత మరో 58 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
వివరాలు
వివాదం ఇదీ..
అక్కడితో ఆగకుండా అసలైన టీఎంసీ తమ వర్గమేనని ప్రకటించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. శాసనసభలో ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీని ఎన్నుకున్నారు.
ఈ ఎంపికకు స్పీకర్ కూడా ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
టీఎంసీ శాసనసభా పక్ష సమావేశంలో తనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై రితబ్రత సైతం సంతకం చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
తొలుత ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ తిరస్కరించింది. దీంతో ఛటోపాధ్యాయ్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.
వివరాలు
వివాదం ఇదీ..
ఈ పిటిషన్‌పై ఆగస్టులో విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్.. రితబ్రత బెనర్జీ నియామకాన్ని తాత్కాలికంగా కొనసాగించేందుకు అనుమతించింది.
అయితే ఈ అంశంపై పూర్తిస్థాయిలో మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌కు సూచించింది.
ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తాజాగా రితబ్రత నియామకాన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.
మమతా బెనర్జీ వర్గం వాదనలను పరిగణనలోకి తీసుకుని కొత్తగా ప్రతిపక్ష నేతను ఎంపిక చేయాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.