Nitish Kumar: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్‌కు లేఖ అందజేత
బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన అనంతరం ఆయన తన రాజీనామాను సమర్పించారు. అంతకుముందు నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. నితీష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాము కట్టుబడి ఉంటామని శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అనంతరం నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నితీష్ కుమార్‌కు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు
బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఆర్జేడీ 79 మంది ఎమ్మెల్యేలతో అదిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ నుంచి 19 మంది, సీపీఐ(ఎంఎల్) నుంచి 12 మంది, సీపీఐ నుంచి 2 మంది, సీపీఐ (ఎం) నుంచి 2 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీ కూటమిలో ఉన్నారు. నితీష్ కుమార్‌కు జేడీయూ చెందిన 45 మంది, బీజేపీకి చెందిన 78 మంది, 4 హిందుస్థానీ అవామ్ మోర్చా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో నితీష్ కుమార్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నితీశ్ కుమార్‌కు మొత్తం 128 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు.