Prashant Kishor: అది ఒక విఫల రాష్ట్రం.. బీహార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జన్ సూరజ్ పార్టీ చీఫ్..
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బిహార్ అభివృద్ధి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీహార్‌ను "ఫెయిల్యూర్ స్టేట్"గా పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ఉన్న బీహారీ ప్రవాసులతో వర్చువల్ సమావేశంలో పాల్గొని, బీహార్ పరిస్థితి తీవ్రమైందని వ్యాఖ్యానించారు. జనాభా పరంగా బీహార్ ప్రపంచంలో 11వ అతిపెద్ద దేశంగా ఉండేదని, ఇది జపాన్‌ను దాటేసిందని కూడా తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతర కృషి అవసరమని ఆయన హితవు పలికారు.
బీహారీ ప్రవాసులు రాష్ట్రాభివృద్ధికి మద్దతు ఇవ్వాలని పిలుపు
ప్రశాంత్ కిషోర్ తన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2025లో పాఠశాల విద్య అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటామని పేర్కొన్నారు. మద్యం నిషేధాన్ని సమీక్షించి, అవసరమైతే ఎత్తివేయాలని సూచించారు, ఎందుకంటే ఆ నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని ఆయన వివరించారు. బీహారీ ప్రవాసులు చర్చలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు చూపించలేకపోయినా, భవిష్యత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నామని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. 2025లో జన్ సురాజ్ విజయాన్ని ఖాయంగా చూస్తున్నామని, 2029-2030 నాటికి బీహార్‌ను మధ్య-ఆదాయ రాష్ట్రంగా మార్చడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. అంకితభావంతో పని చేస్తే ఏదైనా సాధ్యమే అని విశ్వాసం వ్యక్తం చేశారు.