Social Media: బిహార్'లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం సోషల్ మీడియా గైడ్‌లైన్స్.. ఖాతా తెరవాలంటే అనుమతి తీసుకోవాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలలో ఉద్యోగులు ఎలా ప్రవర్తించాలో స్పష్టమైన నియమాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలు రాష్ట్రంలోని ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అన్ని రకాల ఉద్యోగులకు వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదంతో, బిహార్ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసింది. ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం పెట్టడం లక్ష్యం కాదని, డిజిటల్ వేదికల్లో హద్దులు పాటిస్తూ సజావుగా ప్రవర్తించేటట్లు చూసుకోవడమే ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వివరాలు
ముఖ్యమైన మార్గదర్శకాలు:
కొత్తగా సోషల్ మీడియా ఖాతాలు తెరవాలంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. నకిలీ ఖాతాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదు. అధికారిక హోదా,ప్రభుత్వ లోగో లేదా హోదాకు సంబంధించిన ఏ విధమైన పోస్టులు ఆన్‌లైన్‌లో పెట్టకూడదు. వ్యక్తిగత ఖాతాలకు ప్రభుత్వ ఈ-మెయిల్ లేదా ప్రభుత్వ ఫోన్ నంబర్లు వాడకూడదు. ఉద్యోగుల వ్యక్తిగత అభిప్రాయాలు ప్రభుత్వ హోదాతో అనుసంధానం లేవని స్పష్టం చేయడం లక్ష్యం. అశ్లీల, కుల, మతాలను లక్ష్యంగా చేసుకున్న లేదా సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కంటెంట్‌పై నిషేధం. అధికారిక కార్యక్రమాల వీడియోలు,ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో షేర్ చేయరాదు. ఏ కంటెంట్‌ను పోస్టు లేదా షేర్ చేయవచ్చో, ఎలాంటి కంటెంట్ నిషేధం ఉన్నదో స్పష్టంగా నియమాలు ఏర్పాటు చేయబడ్డాయి.