నెల రోజుల క్రితం పుట్టిన చిన్నారికి 'బిపోర్‌జాయ్' తుపాను పేరు
నెల రోజుల క్రితం జన్మించిన పాపకు ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం గుజరాత్, ముంబై తీరాలను వణిస్తున్న 'బిపోర్‌జాయ్' తుపాను పేరు పెట్టుకున్నారు. దీంతో తుపాను పేరు పెట్టుకున్నవారి జాబితాలో చిన్నారి చేరింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోంది. గంటగంటకు మరింత తీవ్ర రూపం దాల్చుతున్న ఈ సైక్లోన్ గురువారం సాయంత్రానికి తీరం దాటనుంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి కుటుంబం కూడా కచ్ జిల్లాలోని జఖౌలో షెల్టర్ హౌస్‌లో తలదాచుకుంటోంది. ప్రభావిత ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన వేలాది మందిలో వారు కూడా ఉన్నారు.
1 లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన గుజరాత్ ప్రభుత్వం
గతంలో కూడా వచ్చిన తిత్లీ, ఫణి, గులాబ్ వంటి తుపాన్ల పేర్లను కూడా చిన్నారులకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ చిన్నారి పెద్దయ్యాక, 'బిపోర్‌జాయ్' పేరు అర్థం 'విపత్తు' అని తెలుసుకున్న తర్వాత సంతోషించకపోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 'బిపోర్‌జాయ్' పేరును బంగ్లాదేశ్ పెట్టింది. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) దేశాలు 2020లో ఈ పేరును స్వీకరించాయి. తీర ప్రాంతాల నుంచి గుజరాత్ ప్రభుత్వం ఇప్పటి వరకు 1 లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.