Maharastra: బీజేపీ 22, సేన 12: మంత్రి పదవుల కోసం మహారాష్ట్ర పవర్ షేర్ ఫార్ములా !
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.
రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుండగా, మంత్రి పదవుల పంపకంపై చర్చలు వేగంగా సాగుతున్నాయి.
మహాయుతి కూటమిలో పార్టీలకు ఎంతమంది మంత్రుల పదవులు కేటాయిస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల్లో గెలిచిన సీట్ల ఆధారంగా ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకుగాను ఒక మంత్రి పదవి లభించే అవకాశంపై పార్టీలో చర్చ జరుగుతోందని సమాచారం.
మహాయుతి కూటమిలో అంతర్గత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ పార్టీలకు సంబంధించి మంత్రి పదవుల కేటాయింపు కీలకంగా మారింది.
వివరాలు
6-1 ఫార్ములాను అమలు చేయాలనే యోచన
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, 6-1 ఫార్ములాను అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మూడు పార్టీల్లో ప్రతీ ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి కేటాయించే ప్రణాళిక ఉందని సమాచారం.
ఈ లెక్కన, బీజేపీ 132 సీట్లు గెలిచిన నేపథ్యంలో, కాషాయ పార్టీకే 20-22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 12, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీకే 9-10 పదవులు లభించే అవకాశాలున్నాయి.
అయితే, శాఖల కేటాయింపు విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యమైన శాఖలను బీజేపీ తన అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఈ నేపథ్యంలో, శివసేన, ఎన్సీపీకి ఎలాంటి శాఖలు కేటాయిస్తారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.