Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో పొత్తుపై బీజేపీ, అకాలీదళ్ మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల కోసం పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్, బీజేపీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. పాత పొత్తుల ఫార్ములా ప్రకారం.. అకాలీదళ్‌కు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి పంజాబ్‌లోని బీజేపీ నాయకత్వం సిద్ధంగా లేదు. దీంతో పొత్తు చర్చలు కొలిక్కి రాలేదని ఇండియా టూడే వర్గాలు తెలిపాయి. పంజాబ్‌లో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు ప్రకటించిన తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
6స్థానాలను అడిగిన బీజేపీ.. ఒప్పుకోని అకాలీదళ్
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చినప్పుడు, దానికి నిరసనగా అకాలీదళ్ ఎన్‌డీఏతో బంధాన్ని తెంచుకుంది. ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అయితే ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు గాను 6చోట్ల పోటీ చేయాలని బీజేపీ భావించింది. అయితే ఇన్ని సీట్లు ఇచ్చేందుకు అకాలీదళ్ అంగీకరించలేదు. ఎన్డీయేలో భాగమైనప్పుడు అకాలీదళ్ 10 స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేసింది. ఇప్పుడు అదే ఫార్ములాను పాటించాలని అకాలీదళ్ చెప్పగా.. దానికి బీజేపీ ఒప్పుకోలేదని తెలుస్తోంది.