Kalidas Kolambkar: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్కర్
బీజేపీ సీనియర్ నాయకుడు కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో జరిగింది. అక్కడ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితుడైన కొలాంబ్కర్, మహారాష్ట్ర అసెంబ్లీలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అనంతరం శాశ్వత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు.
అసెంబ్లీ ఏర్పాటుకు తొలి అడుగు
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఏక్‌నాథ్ షిండే శివసేనలతో కూడిన మహాయుతి కూటమి విజయాన్ని సాధించింది. ఈ విజయం అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో నూతన అసెంబ్లీ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రొటెం స్పీకర్ నియామకం ద్వారా అసెంబ్లీ ఏర్పాటుకు తొలి అడుగు వేయడం జరిగింది.