Milkipur Bypoll: మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఫలితంపై కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే అయోధ్య రామమందిరం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ ఎంపీ స్థానం (అయోధ్య) నుంచి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేత అవధేశ్ ప్రసాద్ గెలవడం సంచలనంగా మారింది.
రామమందిర నిర్మాణం పూర్తయిన కొన్ని నెలలకే బీజేపీ ఓటమి పాలవ్వడం చర్చనీయాంశమైంది. ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ ఎంపీగా గెలవడంతో మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు.
దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీజేపీ విజయం దిశగా సాగుతోంది.
Details
10 వేలు మెజార్టీ దిశగా బీజేపీ
అయోధ్యలో ఎలాగైనా గెలవాలని నిర్ణయించుకున్న బీజేపీ, మిల్కిపూర్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలకు సిద్ధమైంది.
ఈ ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ మధ్య పోటీ నెలకొంది. తాజా లెక్కల ప్రకారం బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ 10,000కి పైగా ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
ఫిబ్రవరి 5న మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో మొత్తం 3.70 లక్షల మంది ఓటర్లలో 65 శాతం కంటే ఎక్కువ మంది
తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ శాతం 2022 అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా నమోదైంది.
Details
రామమందిర ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం
రామమందిరం నిర్మితమైన అయోధ్య పరిధిలోని మిల్కిపూర్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తే, ఇది పార్టీకి గట్టి ఊరట కలిగించే అంశం.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ ఎంపీ స్థానం కోల్పోవడంతో బీజేపీకి తీవ్ర నిరాశ ఎదురైంది.
అయితే మిల్కిపూర్ ఉప ఎన్నికలో విజయాన్ని కైవసం చేసుకుని తమ పట్టును తిరిగి నిరూపించుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది.
మొత్తంగా మిల్కిపూర్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం దిశగా సాగుతుండటంతో ఈ ఫలితాలు ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.