Manish Sisodia: 'నేను తీహార్‌లో ఉన్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది'.. మనీష్ సిసోడియా సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను తీహార్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీ (BJP) తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు.
ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఆప్ (AAP) ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేస్తాం
"నేను జైల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని బీజేపీకి అర్థమైంది. నా భార్య అనారోగ్యంగా ఉందని, నా కుమారుడు చదువుకుంటున్నాడని వాళ్లకు తెలుసు. అప్పుడు వారు నాకు ఒక అల్టిమేటం ఇచ్చారు. 'అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను వదిలేయి, లేదా జైల్లోనే మగ్గిపో' అని చెప్పారు. నేను బీజేపీలో చేరితే ఆప్ (AAP) ఎమ్మెల్యేల కూటమిని విచ్ఛిన్నం చేస్తామని వారు చెప్పారు. నన్ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్‌ను నేను అంగీకరించకపోతే, సుదీర్ఘకాలం జైల్లోనే ఉండేలా చేస్తామని బీజేపీ బెదిరించింది'' అని సిసోడియా ఆరోపించారు.
వివరాలు
బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలే లక్ష్యం
ఈ సందర్భంగా కమలం పార్టీపై, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
''ఇదే వారి విధానం. ఇతర పార్టీల నుండి నాయకులను కొనుగోలు చేస్తారు. బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటారు. వారు మాట వినకపోతే, తప్పుడు కేసులతో వారిని జైలుకు పంపిస్తారు. స్కూల్స్, ఆసుపత్రులు, ప్రజల అవసరాలకు వారికి పట్టింపు లేదు. కేవలం అధికారం కోసమే ఆరాటపడుతారు'' అని సిసోడియా దుయ్యబట్టారు.
వివరాలు
గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్
2023లో దిల్లీ మద్యం విధానానికి సంబంధించి కేసులో సిసోడియా అరెస్ట్ అయ్యిన విషయం తెలిసిందే.
దాదాపు 17 నెలలు కస్టడీలో ఉన్న ఆయనను గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) జాంగ్‌పురా నుంచి ఆయన పోటీ చేయనున్నారు.
70 శాసనసభ స్థానాలున్న దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడించనున్నారు.