LOADING...
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో మమతకు చెక్.. బీజేపీ విజయం వెనుక సువేందు అధికారి కీలక పాత్ర
బీజేపీ విజయం వెనుక సువేందు అధికారి కీలక పాత్ర

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో మమతకు చెక్.. బీజేపీ విజయం వెనుక సువేందు అధికారి కీలక పాత్ర

వ్రాసిన వారు Sirish Praharaju
May 04, 2026
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారానికి దాదాపు చేరువైంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరుకోవడంతో, ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సువేందు అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయన చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీకు అత్యంత సమీపంగా ఉండి తృణమూల్ కాంగ్రెస్‌ను బలోపేతం చేసిన ఆయన, తరువాత ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా మారి అదే ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించారు.

వివరాలు 

రాజకీయ నేపథ్యం

సువేందు అధికారి 1970లో పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో రాజకీయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సిసిర్ అధికారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు 1995లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంథీ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి తండ్రితో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2006లో కాంథీ దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2009, 2014లో తమలుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

వివరాలు 

నందిగ్రామ్‌ పోరాటం..

సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక మలుపు తీసుకువచ్చింది. 2007లో నందిగ్రామ్ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. రైతుల భూములను కాపాడేందుకు మమతా బెనర్జీతో కలిసి పోరాటం సాగించారు. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి 2011లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. ఆ తర్వాత తృణమూల్ ప్రభుత్వంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ లోపల కీలక నాయకుడిగా, రెండో శక్తిగా ఎదిగారు.

Advertisement

వివరాలు 

విభేదాలు.. పార్టీ మార్పు

కాలక్రమేణా మమతా బెనర్జీతో సువేందు అధికారి మధ్య విభేదాలు పెరిగాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాభవం పెరగడం వంటి కారణాలతో 2020లో ఆయన తృణమూల్ కాంగ్రెస్‌తో 22 ఏళ్ల అనుబంధాన్ని ముగించారు. అదే ఏడాది అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇది బెంగాల్ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.

Advertisement

వివరాలు 

మమతపై విజయం.. 

2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి, మమతాను ఓడించి రాజకీయంగా మరింత బలమైన నేతగా నిలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ, ఆయన విజయం పార్టీకి ఉత్సాహాన్ని నింపింది. అనంతరం ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు.

వివరాలు 

తాజా ఎన్నికల్లో కీలక పాత్ర

2026 ఎన్నికల్లో కూడా సువేందు అధికారి నందిగ్రామ్‌తో పాటు భవానీపూర్ నుంచి పోటీ చేశారు. తృణమూల్ బలాలు, బలహీనతలపై పూర్తి అవగాహన ఉండటం, అలాగే నరేంద్ర మోదీ, అమిత్ షా ల మద్దతు లభించడం ఆయనకు అనుకూలంగా మారింది. తూర్పు మేదినీపూర్, నందిగ్రామ్ ప్రాంతాల్లో ఆయన కుటుంబానికి ఉన్న బలమైన పట్టును ఉపయోగించుకుని భాజపాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. మమతా బెనర్జీ తరహాలోనే పోరాట ధోరణిని కొనసాగిస్తూ, చొరబాట్ల అంశంపై తృణమూల్ ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించారు. ఈ ఎన్నికల్లో భాజపా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకరిగా నిలిచిన సువేందు అధికారి, ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుడిగా ఎదిగారు.

Advertisement