LOADING...
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్‌బాక్స్‌ టెక్నాలజీ.. ప్రయాణ భద్రతకు కొత్త దశ!
ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్‌బాక్స్‌ టెక్నాలజీ.. ప్రయాణ భద్రతకు కొత్త దశ!

TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్‌బాక్స్‌ టెక్నాలజీ.. ప్రయాణ భద్రతకు కొత్త దశ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 04, 2025
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణికుల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా సంస్థ కొత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా, బస్సుల్లో 'ఐ-ఎలర్ట్‌' (i-Alert) అనే ఆధునిక పరికరాన్ని అమర్చుతోంది. ఈ పరికరం ద్వారా ఆర్టీసీ అధికారులు ప్రతి బస్సు నడుస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించగలరు. డ్రైవర్‌ బస్సును నడుపుతున్న తీరు, వేగం, బ్రేకులు వేసిన తరుణం, గేర్ల మార్పులు, ఎక్స్‌లేటర్‌ వినియోగం, ఇంధన వినియోగం వంటి అంశాలను పూర్తిగా ట్రాక్‌ చేయవచ్చు. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని డ్రైవర్లకు గ్రేడింగ్‌ ఇస్తారు. 10 పాయింట్లలో 6 కన్నా తక్కువ మార్కులు వస్తే, వారు వాహనాన్ని సరిగా నడపడం లేదని నిర్ధారిస్తారు.

Details

ప్రమాద నివారణకు చర్యలు

అలాంటి డ్రైవర్లకు తక్షణమే కౌన్సెలింగ్‌ ఇచ్చి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటారు. ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ సమయంలో బస్సు వేగం, దిశ, బ్రేక్‌ స్థితి వంటి వివరాలన్నీ ఈ పరికరం ద్వారా లభిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే, విమానాల్లో ఉన్న 'బ్లాక్‌బాక్స్‌' మాదిరిగానే, RTC బస్సుల్లో 'ఐ-ఎలర్ట్‌' వ్యవస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న BS-6 బస్సుల్లో ఈ పరికరాల అమరిక తుది దశలో ఉంది. ఇటీవల అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ఇంజినీర్లు ఈ పరికరాల పనితీరు, వినియోగ విధానం గురించి డిపో మేనేజర్లు, భద్రతా అధికారులు, మెకానిక్‌లకు అవగాహన కల్పించారు. ఈ ఆధునిక పరికరాన్ని 'ఆరీ టెలీమ్యాటిక్స్‌' (Ari Telematics) అని కూడా పిలుస్తారు.