
Bomb threat: బేగంపేట విమానాశ్రయంలో బాంబ్ బెదిరింపు కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో బుధవారం ఉదయం ఒక సందేశం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్‌లో ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పెట్టినట్లు పేర్కొనడంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు వెంటనే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని తనిఖీలు ప్రారంభించాయి. ప్రతి మూలను జల్లెడ పట్టి గాలించి అనుమానాస్పద వస్తువుల కోసం విస్తృతంగా శోధించారు.
Details
బాంబు లేదని గుర్తించిన అధికారులు
అయినప్పటికీ ఎటువంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు కనుగొనలేకపోయారు. గంటల పాటు సాగిన తనిఖీల అనంతరం ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఎటువంటి బాంబు లేదని అధికారులు అధికారికంగా స్పష్టం చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది, భద్రతా బృందాలు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి కావాలనే ఉద్దేశంతో ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇమెయిల్ పంపిన వ్యక్తి ఎవరన్న దానిపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈ ఘటన వల్ల ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.